దివ్యఖుర్ఆన్ మరియు దాని విభజన (The Divison of Quran into Parts)

అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : సయ్యద్ యూసుఫ్ పాషా

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం

దివ్యఖుర్ఆన్ లోని విభిన్న విషయాలకు అనుగుణంగా మరియు ఒక నిర్ణీత సమయంలో దానిని పూర్తిగా పఠించే పాఠకుల సౌకర్యానికి అనుగుణంగా ఆ దివ్యగ్రంథం అనేక అధ్యాయాలుగా, భాగాలుగా, అంశాలుగా విభజించబడినది. ఈ విభజనకు ఇవ్వబడిన అరబీ భాషా పదాలు – మన్ జిల్,  జుజ్, సూరహ్, రుకూ మరియు ఆయహ్. ఒక్కో అనువాదంలో ఈ అరబీ పదాలు ఒక్కో విధంగా అనువదించబడినవి. అంటే వేర్వేరు అనువాదములలో వీటికి వేర్వేరు అర్థములు, వివరణలు వేర్వేరుగా ఇవ్వబడెను. కాని తరచుగా సూరహ్, ఆయహ్ వంటి కొన్ని పదములను వాటి అసలు భాష అయిన అరబీ భాషలోనే వాడటం జరుగుతున్నది. అంతే కాని, అరబీ భాషాపదాలకు బదులుగా వాటి అనువాదపు పదములు అంతగా వాడుకలో లేవు.

– ఆయహ్ آية

ఆయహ్ అనేది ఖుర్ఆన్ యొక్క ఒక యూనిట్ అంటే ఒక అతి చిన్నభాగం, ఇది అల్లాహ్ తరఫున మానవజాతికి పంపబడిన మార్గదర్శకత్వము. కాబట్టి, ఖుర్ఆన్ యొక్క ఆ అతి చిన్నభాగాలు ఆయహ్ అంటే అల్లాహ్ యొక్క వివేకానికి చిహ్నాలు అని పిలవబడటంలో ఆశ్చర్యపడవలసినదేమీ లేదు. ఖుర్ఆన్ అనేది ఒక కావ్యగ్రంథం కాదు కాబట్టి, ఆయహ్ కు బదులుగా వచనం, శ్లోకం లేదా సూక్తి అనే పదాలు వాడటం సరైన పద్ధతి కాదు. ఖుర్ఆన్ లోని ప్రతి ఆయహ్ ఒకే సైజులో ఉండదు. వేర్వేరు సూరహ్ లలో వేర్వేరు సైజులలో ఉన్నది. కేవలం రెండే అక్షరాలతో ఒక్కో ఆయహ్ అతి చిన్న సైజులో ఉండవచ్చు లేదా అనేక పదాలతో పెద్ద సైజులో ఉండవచ్చు. ఉదాహరణకు ‘హా-మీమ్’ అనేది ఖుర్ఆన్ లోని అతి చిన్న ఆయహ్. దీనిలో కేవలం రెండే అక్షరాలు ఉన్నాయి. ఖుర్ఆన్ లో ఒక్కోచోట ఆయహ్ యొక్క  పరిమాణం ఆయతుల్ కుర్సీ అంతటి పెద్దది కూడా కావచ్చు. అది అరబీభాషా వ్యాకరణంలోని ఏ నియమం పైనా ఆధారపడిలేదు. కాబట్టి ఆయహ్ యొక్క సైజును లేదా ఆయహ్ యొక్క విభజనను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించిన ప్రకారం మాత్రమే స్వీకరించవలెను. ఖుర్ఆన్ లో మొత్తం ఎన్ని ఆయహ్ లు ఉన్నాయి అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే దివ్యఖుర్ఆన్ లో కనీసం 6500 ఆయహ్ లు ఉన్నాయనేది పండితుల అభిప్రాయం.

– సూరహ్ سورة

సూరహ్ (బహువచనం సువర్) అంటే అరబీ భాషాపరంగా వరుస, పంక్తి, క్రమము, కంచె అని అర్థం. అయితే సాంకేతిక భాషాపరంగా సూరహ్ అనేది విభజింపబడిన ఖుర్ఆన్ గ్రంథపు భాగాలకు ఇవ్వబడిన పేరు. దివ్యఖుర్ఆన్ లో 114 సూరహ్ లు ఉన్నాయి. అవన్నీ ఒకే సైజులో లేవు. అతి చిన్ని సూరహ్ లో కేవలం మూడే ఆయహ్ లు ఉన్నాయి. ఉదాహరణ – సూరహ్ అల్ అసర్, సూరహ్ అన్నస్ర్ మరియు సూరహ్ అల్ కౌథర్. అతి పెద్ద సూరహ్ అయిన అల్ బఖరహ్ లో 286 ఆయహ్ లు ఉన్నాయి. మనం చదివే ఇతర గ్రంథాల మాదిరిగా దివ్యఖుర్ఆన్ లో సూరహ్ ల(భాగాల) విభజన విషయం, చర్చ లేదా అంశం ఆధారంగా జరుగలేదు. సూరహ్ లో చర్చించబడుతున్న విషయం ఆకస్మికంగా ఒక అంశం నుండి వేరే అంశానికి మారడాన్ని పాఠకులు తరచుగా గమనిస్తారు. ఇతర ఏ గ్రంథంలోనూ కనబడని ఈ ప్రత్యేకతే దివ్యఖుర్ఆన్ కు ఒక విశేష గుర్తింపును ఆపాదిస్తున్నది. అలాగే, ఒక సూరహ్ లో మరల చిన్న అధ్యాయాలు గాని, పేరాలు గాని లేవు. కాబట్టి అధ్యాయం అవేది ‘సూరహ్’ అనే ఈ అరబీ పదానికి అనువాదం కాజాలదు.

– రుకూ رُكو

రుకూ అనబడే చిన్న భాగాలుగా ఖుర్ఆన్ లోని సూరహ్ లు విభజింపబడినవి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో గాని లేదా వారి సహచరుల (సహాబాల) కాలంలో గాని జరుగలేదు. తర్వాత కాలంలో హజ్జాజ్ బిన్ యూసుఫ్ అనే ఒక ఇస్లామీయ రాజ్యపాలకుని అధ్వర్యంలో పాఠకుల సౌలభ్యం కోసం ఖుర్ఆన్ లోని సూరహ్ లు రుకూలుగా విభజింపబడినవి. ఖుర్ఆన్ లో ع అనే అరబీ అక్షరం, దాని పై నుండే సంఖ్యల ద్వారా అవి గుర్తింప బడును.

– జుజ్ جُز

జుజ్ అనబడే దాదాపు 30 సమానమైన భాగాలుగా ఖుర్ఆన్ విభజింబడినది. పాఠకులు సులభంగా పఠించడానికి, ప్రత్యేకంగా రమదాన్ పవిత్ర మాసంలో ప్రతి రాత్రి పఠించడానికి వీలుగా ఇలా విభజింపబడినది. ఈ భాగాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల (సహాబాల) కాలంలో కూడా ఉండేవని ఔస్ బిన్ హుదైఫా ఉల్లేఖించిన ఈ హదీథ్ ద్వారా తెలుస్తున్నది: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో వారి సహచరులు (సహాబాలు) ఖుర్ఆన్ ను ఎలా విభజించినారని సహాబాలను ఔస్ బిన్ హుదైఫా ప్రశ్నించగా, వారు ఇలా జవాబిచ్చినారు, “మూడో వంతు, ఐదో వంతు, ఏడో వంతు, తొమ్మిదవ వంతు, పదకొండవ వంతు, పదమూడవ వంతు & ముఫశ్శిల్ నుండి చివరి వరకు”.

– హిజ్బ్

ఖుర్ఆన్ లోని ప్రతి జుజ్ నాలుగు హిజ్బ్ లుగా విభజింపబడినది. మరల ప్రతి హిజ్బ్ నాలుగు భాగాలుగా విభజింపబడినది – పేజీ ప్రక్కభాగంలో నిర్ణీత ఆయహ్ లకు ఎదురుగా నాలుగింట మొదటిది రుబు (1/4), నాలుగింట రెండోది నిస్ఫ్ (1/2) మరియు నాలుగింట మూడోది థులుథ్ (3/4) అని సూచింపబడి ఉండును.

– మన్జిల్ منزل

ఖుర్ఆన్ గ్రంథం మరల మన్జిల్ అనబడే సమానమైన ఏడు భాగాలుగా విభజింపబడినది. ఇది మన్జిల్ منزل అనే చిహ్నం దానికి సంబంధించిన వరుసక్రమ సంఖ్యతో సహా పేజీ ప్రక్కన ఉండే మార్జిన్ స్థలంలో కనబడును. ఒక వారంలో ఖుర్ఆన్ గ్రంథ పఠనాన్ని పూర్తి చేసేందుకు వీలుగా సహాబాలు ఈ విభజన చేసినారు. మొదటి మన్జిల్ లో సూరహ్ ఫాతిహా కాకుండా ఖుర్ఆన్ లోని మొదటి మూడు సూరహ్ లు ఉన్నాయి, రెండవ మన్జిల్ లో ఐదు, మూడవ మన్జిల్ లో ఏడు, నాలుగవ మన్జిల్ లో తొమ్మిది, ఐదవ మన్జిల్ లో పదకొండు, ఆరవ మన్జిల్ లో పదమూడు మరియు ఏడవ మన్జిల్ లో మిగలిన అరవై ఐదు సూరహ్ లు ఉన్నాయి.

– జతలు, జంటలు, జోడీ

ఖుర్ఆన్ లోని కొన్ని సూరహ్ లు జంటలుగా గుర్తింపబడినాయి. ఉదాహరణకు – సూరహ్ అల్ బఖరహ్ మరియు సూరహ్ ఆలే ఇమ్రాన్. అలాగే సూరహ్ బని ఇస్రాయీల్ మరియు అల్ కహఫ్. వాటిలో ఉపదేశింపబడిన విషయపు సారూప్యం వలన అవి జంటలుగా గుర్తింపబడినవి. అయితే ఇతర ఏ సూరహ్ కూ జోడీగా గుర్తింపబడని కొన్ని ప్రత్యేక సూరహ్ లు కూడా ఉన్నాయి ఉదారహణకు సూరహ్ యాసీన్.

– మక్కా మరియు మదీనాహ్ సూరహ్ ల విభజన

అవతరణ క్రమాన్ని పరిశోధిస్తూ, వాటి అవతరణ సమయాన్ని బట్టి ఖుర్ఆన్ గ్రంథంలోని సూరహ్ లను మక్కా సూరహ్ లుగా మరియు మదీనాహ్ సూరహ్ లుగా పండితులు విభజించారు.  ఈ విభజన ద్వారా ఖుర్ఆన్ సూరహ్ లలో కొన్ని మక్కా సూరహ్ లని మరియు మిగిలినవి మదీనాహ్ సూరహ్ లని ప్రసిద్ధి చెందినవి. హిజ్రహ్ కు (అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మక్కా నగరం నుండి మదీనా పట్టణానికి వలస పోయిన సమయం) పూర్వం అవతరించిన సూరహ్ లను మక్కా సూరహ్ లుగా మరియు హిజ్రహ్ తర్వాత అవతరించిన సూరహ్ లను మదీనాహ్ సూరహ్ లుగా విభజింపబడినవి. ఈ విధానం ప్రకారం మొత్తం సూరహ్ లు ఏడు మక్కా – మదీనాహ్ సూరహ్ ల సమూహాలుగా  విభజించబడినవి – వీటిలో మొత్తం మక్కా సూరహ్ ల సంఖ్య 86 & మదీనాహ్ సూరహ్ ల సంఖ్య 28. కేవలం కొన్ని సూరహ్ ల అవతరణ పై తప్ప, ఈ అవతరణ క్రమం పై దాదాపు పండితులందరి ఏకాభిప్రాయం ఉన్నది. కొన్ని సూరహ్ లలోని ఆయహ్ లన్నీ అవతరణ క్రమాన్ని అనుసరించి, ఒకే విభాగం లోనికి అంటే మక్కా సూరహ్ లేక మదీనాహ్ సూరహ్ ల విభాగంలోనికి రావని కొందరి అభిప్రాయం. ఉదాహరణకు సూరహ్ హజ్జ్ లోని ఆయహ్ లన్నీ మక్కాలో అవతరించినవని కొందరు, మదీనాహ్ లో అవతరించినవని మరికొందరు అభప్రాయపడుతున్నారు. అయితే రెండు అభిప్రాయాలూ సరైనవే. ఎందుకంటే దానిలో మక్కాలో అవతరించిన కొన్ని ఆయహ్ లు మరియు మదీనాహ్ లో అతవరించిన కొన్ని ఆయహ్ లు ఉన్నాయి.

చివరిగా –ఖుర్ఆన్, సూరహ్ అల్ ఇస్రా  17: 80 – “ఓ నా రబ్ (ఓ నా ప్రభూ)!నీవు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళినా సత్యంతో తీసుకొని వెళ్ళు.ఎక్కడ నుండి తీసినా, సత్యంతో తియ్యి. నీ తరఫు నుండి ఒక అధికారాన్ని నాకు సహాయంగా.”

అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన అత్తిర్మిథీ & ఇబ్నె మాజా హదీథ్ గ్రంథాలలో నమోదు చేయబడిన ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రార్థించేవారని తెలుపబడినది – “ఓ అల్లాహ్, నీవు ఉపదేశించిన దానిలో నాకు శుభాన్ని ప్రసాదించుము. నాకు ప్రయోజనం చేకూర్చే వాటిని నాకు బోధించుము. మరియు నాలో జ్ఞానాన్ని పెంపొందించుము. అన్ని పరిస్థితులలోనూ సకల ప్రశంసలు నీకే చెందును. నరకంలోనికి వెళ్ళేవారి పరిస్థితి (జీవనవిధానం) నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.” ఆమీన్.