సలాతుల్ జమాహ్

సలాతుల్ జమాహ్: అందరూ కలిసి, సమూహంగా ఒకేసారి నమాజు చేయటం

 సలాతుల్ జమాహ్ యొక్క ప్రాధాన్యత:

قال الله تعالى: )وَإِذَا كُنْتَ فِيهِمْ فَأَقَمْتَ لَهُمُ الصَّلاةَ فَلْتَقُمْ طَائِفَةٌ مِنْهُمْ مَعَكَ وَلْيَأْخُذُوا أَسْلِحَتَهُمْ فَإِذَا سَجَدُوا فَلْيَكُونُوا مِنْ وَرَائِكُمْ وَلْتَأْتِ طَائِفَةٌ أُخْرَى لَمْ يُصَلُّوا فَلْيُصَلُّوا مَعَكَ وَلْيَأْخُذُوا حِذْرَهُمْ وَأَسْلِحَتَهُمْ( (النساء 102)

“ప్రవక్తా!  ఒకవేళ నీవు ముస్లింల మధ్య ఉండి (యుద్ధం జరుగుతుండగా) నమాజ్ చేయించటానికి వారితో నిలబడితే, వారిలోని ఒక వర్గం నీతో పాటు నిలబడాలి, వారు అస్త్రధారులై ఉండాలి. వారు తమ సజ్దాను పూర్తి చేసుకుని వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇంకా నమాజ్ చేయని రెండో వర్గం వచ్చి నీతోపాటు నమాజు చెయ్యాలి. వారు కూడా జాగరూకులై ఉండాలి. తమ ఆయుధాలను ధరించి ఉండాలి.” దివ్యఖుర్ఆన్ సూరహ్ అన్నిసా 102

 عن أبي هريرة رضي الله عنه قال- قال رسول الله :r“أثقل صلاة على المنافقين صلاة العشاء وصلاة الفجر ولو يعلمون ما فيهما لأتوهما ولو حبوا.” (رواه البخاري ومسلم)

అబి హురైరత రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా బోధించారు – కపటులకు ఇషా నమాజు (తొలిరేయి సమయంలో చేసే నమాజు) మరియు ఫజర్ నమాజు (ప్రాత:కాలంలో చేసే నమాజు) కంటే కష్టతరమైన నమాజు ఇంకేదీ లేదు. మరియు ఒకవేళ ఈ రెండు నమాజులలో (ఆయా సమయాలలో పూర్తిచేయటం వలన) లభించే శుభాలు (పుణ్యాలు) గనుక వారికి తెలిసినట్లయితే, పాకుతూ రావలసి వచ్చినా సరే, వారు తప్పక హాజరవుతారు.

 عن عبدالله بن عمر رضي الله عنهما قال- قال رسول اللهr: “صلاة الجماعة أفضل من صلاة الفذ بسبع وعشرين درجة.” (رواه البخاري ومسلم)

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన మరొక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా బోధించారు – ఒంటరిగా నమాజు చేయటం కంటే సమూహంగా నమాజు చేయటమనేది 27 రెట్లు ఎక్కువగా  ఉన్నతమైనది.  బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు.

 ఇమాం (సమూహానికి నమాజు చదివించే నాయకుడి) గా ఎవరు ఉండాలి?

ఉఖ్బా బిన్ అమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా బోధించారు – ఎవరైతే సమూహానికి నమాజు చదివించబోతున్నారో వారు అందరి కంటే ఎక్కువగా ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేసిన వారై ఉండాలి, ఒకవేళ వారు ఖుర్ఆన్ కంఠస్థంలో సమంగా ఉన్నట్లయితే, వారిలో ఎవరైతే ఎక్కువగా సున్నహ్ యొక్క జ్ఞానం కలిగి ఉన్నారో, వారు నమాజు చేయించటానికి నాయకత్వం వహించాలి. ఒకవేళ అందులో కూడా సమంగా ఉన్నట్లయితే, ఎవరైతే ముందుగా హిజ్రత్ (మక్కా నుండి వలస పోవటం) చేసారో వారు నమాజు చదివించాలి. ఒకవేళ అందులో కూడా సమంగా ఉన్నట్లయితే, వారిలో ఎవరు ముందుగా ఇస్లాం స్వీకరించారో వారు నమాజు చదివించాలి. – ముస్లిం హదీథ్ గ్రంథం.

కాబట్టి ఇమాం కు ఉండవలసిన అర్హతలు, వరుస క్రమంలో –

1)   ఖుర్ఆన్ కంఠస్థం

2)   సున్నహ్ జ్ఞానం (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క జీవిత విధానపు జ్ఞానం)

3)    ముందుగా హిజ్రత్ (మక్కా నుండి వలస పోయినవారు) చేసినవారు & ముందుగా ఇస్లాం స్వీకరించిన వారు

నమాజు చదివే సహచరులలో, ఇమాం (నాయకుడి) యొక్క స్థానం

1)   ఖిబ్లా (కాబా) దిక్కున, మిగిలిన వారి కంటే ముందుగా ఇమాం నిలబడ వలెను.

2)   నమాజు చేసే సహచరులు ఇమాం వెనుక నిలబడవలెను.

3)   మొదటి పంక్తులు చివరి పంక్తుల కంటే ఉత్తమమైనవి. పంక్తిలో ఎడమ వైపు కంటే కుడి వైపు ఉత్తమమైనది. ఇమాంకు దూరంగా ఉండటం కంటే చేరువలో ఉండటం ఉత్తమమైనది,

ఇమాం వెనుక నమాజు చేసే సహచరులు పాటించవలసిన జాగ్రత్తలు

1)   నమాజులోని ఏ ఆచరణనూ, సహచరులు ఇమాం కంటే ముందుగా  లేదా ఇమాంతో సమానంగా అదే సమయంలో చేయకూడదు. ఇమాం ఆచరించిన తర్వాతనే చేయవలెను.

2)   ఒకవేళ ఎవరైనా ఇమాం రుకూ నుండి లేవక ముందే వచ్చి సమూహంతో పాటు నమాజులో చేరిపోయినట్లయితే, వారు ఆ రకాతును పొందిన వారవుతారు.

3)   ఒకవేళ ఎవరైనా, ఇమాం రుకూ నుండి లేచిన తర్వాత వచ్చి సమూహంతో పాటు నమాజులో చేరి నట్లయితే, వారికి ఆ రకాతు లభించలేదు. వారు మరల ఆ రకాతును పూర్తి చేయవలసి ఉంటుంది.